రెబల్ న్యూస్ రివ్యూ: ఖైదీ నంబర్ 150


యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి..


khaidi n150 review

మెగాస్టార్ చిరంజీవి.. బాక్సాఫీస్ వద్ద లెక్కలేనన్ని సార్లు ప్రభంజనం సృష్టించిన పేరు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే తిరుగులేని కమర్షియల్ హిట్స్ ఇచ్చిన ఈ స్టార్ 2007 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. శంకర్‌దాదా జిందాబాద్ అనే సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిన చిరు, మళ్ళీ ఇన్నేళ్ళకు ‘ఖైదీ నంబర్ 150’తో మెప్పించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే..

కథ: దొంగతనం కేసులో జైలు కెళ్లిన కత్తి శీను(చిరంజీవి) అనే ఖైదీ కలకత్తా జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకుని హైదరాబాద్ వస్తాడు. అక్కడ తన స్నేహితుడు(అలీ) సాయంతో విదేశాలకు పారిపోదామని యత్నిస్తాడు. ఈ క్ర‌మంలో సుబ్బలక్ష్మి(కాజల్) లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అతన్ని ఆపేస్తుంది. ఆపై అనుకోని పరిస్థితిలో అచ్చం తనలాగే ఉన్న శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. వెంటనే ఫ్లాన్ వేసి శంకర్ ప్లేస్ లోకి వెళ్లిపోయి, పోలీసుల దగ్గర శంక‌ర్‌ ను ఇరికిస్తాడు. ఇక అక్కడి నుంచి శంకర్ పెట్టిన ఓ ఓల్డేజ్ హోంకి వెళ్లగా, అక్కడ అంతా శీనునే శంకర్ అనుకోవటంతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడు. అంతేకాదు తన దిల్ కా దడ్కన్ సుబ్బ‌ల‌క్ష్మి కూడా అక్కడే ఉండటంతో డబుల్ హ్యాపీగా ఫీలయిపోతాడు. అంతా సాఫీగా సాగిపోతుందన్న సమయంలో శంకర్ సన్మాన కార్యక్రమంలో శీనుకి కొన్ని భయంకర వాస్తవాలు తెలుస్తాయి. రైతుల ఆత్మహత్యలు, కార్పొరేట్ అగర్వాల్(తరుణ్ అరోర్) అనే దుష్టశక్తితో శంకర్ నీరూరు గ్రామస్థుల తరపున న్యాయం కోసం పోరాటం చేయటం గురించి తెలిసి శీను మారిపోతాడు. అక్కడి నుంచి ఆ బాధ్యతలను తన నెత్తిన మీద వేసుకుని ముందుకెళ్తాడు. ఈ క్రమంలో శీను విజయం సాధించాడా? ‘అసలు శంకర్’ పరిస్థితి ఏంటి? శీను ఏమౌతాడు? అసలు శంకర్ గతమేమిటి? శంకర్ ని నమ్ముకున్న రైతుల సమస్యలు ఏమయ్యాయి? శీను వలన జైలుకు వెళ్లిన శంకర్ పరిస్థితేంటి? అనేదే ఈ సినిమా కథ.

 

ప్ల‌స్ పాయింట్స్:

– చిరంజీవి

– సినిమాటోగ్ర‌ఫీ

–  సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

– డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్:

– విలన్ రోల్

చిత్రం ఎలా ఉందంటే… వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది వంటి సన్నివేశాలను దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్‌. కానీ, తెలుగులో మాత్రం చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్‌నీ బాగా చిత్రీకరించారు. ‘అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ’ పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. ‘రత్తాలూ..’ ‘సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో’ పాటలు హుషారెక్కిస్తాయి. ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ’ కుర్రకారుతో ఈలలేయిస్తుంది. నటన పరంగా… తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్‌ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి.వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

మొత్తంమీద ఈ చిత్రం కేవలం అభిమానులకే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడికి సంక్రాంతి పండగే.

రేటింగ్: 3.25/5

ఫేస్‌బుక్‌ పేజి లైక్ చేయండి..